Sunrisers Hyderabad: బాదుడే బాదుడు... 6.4 ఓవర్లలోనే 100 కొట్టిన సన్ రైజర్స్

IPL 2025 SRHs Explosive Start Against Rajasthan Royals

  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × రాజస్థాన్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
  • బౌండరీలతో విరుచుకుపడిన సన్ రైజర్స్ టాపార్డర్

గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చూసిన వారెవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. విధ్వంసానికి మారుపేరులా సన్ రైజర్స్ బ్యాట్స్ మన్లు ఊచకోత ఓశారు. అదేమీ గాలివాటం కాదని తాజా ఐపీఎల్ సీజన్ లోనూ హైదరాబాద్ తన ట్రేడ్ మార్కు బాదుడకుతెరలేపింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్ హెచ్ జట్టుకు అదరిపోయే ఆరంభం లభించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ తొలి వికెట్ కు  కేవలం 3.1 ఓవర్లలోనే  45 పరుగులు జోడించి ఫ్లయింగ్ స్టార్ట్ అందించింది.  11 బంతుల్లో 5 ఫోర్లతో చకచకా 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ... స్పిన్నర్ మహీశ్ తీక్షణ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ఆ తర్వాత హెడ్ కు మరో చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఈ జోడీ రాజస్థాన్ బౌలింగ్ ను చీల్చిచెండాడంతో సన్ రైజర్స్ 6.4 ఓవర్లలోనే 101 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ 1 ఓవర్ వేసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుటాఫ్ ద పార్క్ రేంజిలో కొట్టిన భారీ సిక్సర్  హైలైట్ గా నిలిచింది. 

ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 123 పరుగులు. ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్ కు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా విచ్చేశారు. ఆయన ఎస్ఆర్ హెచ్ జెండా ఊపుతూ హుషారుగా కనిపించారు.

  • Loading...

More Telugu News