Rhea Chakraborty: సుశాంత్ సూసైడ్ కేసు... హీరోయిన్ రియాకు భారీ ఊరటనిచ్చిన సీబీఐ

- 2020 జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్
- కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తి
- సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కేసు క్లోజర్ రిపోర్టు ఇచ్చిన సీబీఐ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన రియాను సీబీఐ విచారించింది. తాజాగా రియాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో రియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
2020 జూన్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు భావించినప్పటికీ... సుశాంత్ తల్లిదండ్రులు అది ఆత్మహత్య కాదని, హత్య అని కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియాను ఈడీ ప్రశ్నించింది. సుశాంత్ కు రియా డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ జైలుకు కూడా వెళ్లారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ తుది నివేదికను కోర్టుకు అందించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని... చనిపోయేలా ఆయనను ఎవరూ బలవంతం చేయలేదని నివేదికలో కోర్టు తెలిపింది. సుశాంత్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. అయితే, సీబీఐ పేర్కొన్న వివరాలతో ప్రత్యేక కోర్టు ఎంతవరకు ఏకీభవిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక కోర్టు కేసును క్లోజ్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.