Harish Rao: తులం బంగారం అని మోసం చేశారు: హరీశ్ రావు

- తొలి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్న హరీశ్
- తమ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చారని మండిపాటు
- ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శ
తమ ప్రభుత్వంలో తొలి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని... ఇప్పటి వరకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గతంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి... తామే ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రలోని విపంచి కళానిలయంలో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం అంటూ ప్రజలను మభ్యపెట్టారని... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని విమర్శించారు. చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారిని చులకనగా చూడొద్దని... టాటా, బిర్లా వంటి పెద్ద బిలియనీర్లు చిన్నచిన్న ఉద్యోగాలతోనే వారి జీవితాలను ప్రారంభించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ గొప్ప స్థితికి ఎదగాలని సూచించారు. సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ కు చెందిన సల్మా నేహా అనే మహిళ నాలుగు ఉద్యోగాలు సాధించిందని ప్రశంసించారు.