Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ముగిసింది... క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన సీబీఐ

- ఆత్మహత్యకు ఎవరూ ప్రేరేపించలేదని సీబీఐ నిర్ధారణ.
- రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్.
- ముంబై ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదిక సమర్పణ.
- ఎయిమ్స్ నివేదికలో హత్య కాదని నిర్ధారణ.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ముగిసింది. సీబీఐ తన దర్యాప్తు ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత, దర్యాప్తు సంస్థ దాదాపు నాలుగేళ్లపాటు అనేక కోణాల్లో విచారణ జరిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి... రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణలు, అదే విధంగా రియా చక్రవర్తి, సుశాంత్ కుటుంబంపై చేసిన ఆరోపణలకు సంబంధించి రెండు కేసుల్లో సీబీఐ తన నివేదికను సమర్పించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ నిర్ధారించింది. రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి ఈ కేసులో క్లీన్ చిట్ లభించింది.
ముంబై పోలీసులు మొదట ఇది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే, సుశాంత్ కుటుంబం రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020 ఆగస్టు 19న సీబీఐ ఈ కేసును స్వీకరించింది.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య నిపుణులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్య కాదని, ఇది ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు.
సీబీఐ తన నివేదికను ముంబైలోని ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను ఆమోదించాలా, లేదా మరింత దర్యాప్తునకు ఆదేశించాలా? అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.