Ajinkya Rahane: రహానే, నరైన్ ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడినా... చివర్లో స్లో అయిన నైట్ రైడర్స్

- నేటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్
- తొలి మ్యాచ్ లో కేకేఆర్ తో ఆర్సీబీ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసిన కేకేఆర్
ఐపీఎల్ 18వ సీజన్ కు తెరలేచింది. నేడు టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా... కోల్ కతా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది.
ఆరంభంలో కెప్టెన్ అజింక్యా రహానే, ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రహానే 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేయగా... నరైన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు సాధించాడు. అయితే, బెంగళూరు స్పిన్నర్ కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీసి కేకేఆర్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. కీలకమైన రహానే, వెంకటేశ్ అయ్యర్ (6), రింకూ సింగ్ (12) వికెట్లు కృనాల్ పాండ్యా ఖాతాలోకి వెళ్లాయి.
మిడిలార్డర్ లో ఆంగ్ క్రిష్ రఘువంశీ 30 పరుగులతో ఓ మోస్తరుగా రాణించాడు. క్వింటన్ డికాక్ (4), ఆండ్రీ రస్సెల్ (4) తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో ధాటిగా ఆడేవాళ్లు లేకపోవడంతో కేకేఆర్ స్కోరు నిదానించింది.
ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, జోష్ హేజెల్ వుడ్ 2, యశ్ దయాళ్ 1, రసిక్ దార్ సలామ్ 1, సుయాష్ శర్మ 1 వికెట్ తీశారు.