PVR Inox IPL: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. పీవీఆర్ ఐనాక్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు

- ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం కోసం బీసీసీఐతో పీవీఆర్ ఐనాక్స్ ఒప్పందం
- దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఉన్న తమ సినిమాస్‌లో మ్యాచ్‌ల ప్రసారం
- వీకెండ్ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్‌లు థియేటర్లలో ప్రదర్శన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రముఖ సినిమా చైన్ పీఈఆర్ ఐనాక్స్ కీలక ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఉన్న తమ సినిమాస్‌లో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు డీల్ చేసుకుంది.
ఇవాళ జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకతో ఈ ప్రసారాలు ప్రారంభం అవుతాయని ఐనాక్స్ ప్రకటించింది. వీకెండ్ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్ లను అభిమానుల కోసం తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. మంచి సౌండ్ సిస్టమ్, హైక్వాలిటీ విజువల్స్, కంఫర్టబుల్ సీటింగ్‌తో స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుందని తెలిపింది.
సినిమాను, క్రియేటర్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ, ఆపరేషన్స్ సీఈఓ గౌతమ్ దత్తా అన్నారు. గత సీజన్‌లో ప్రసారం చేసిన మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంపై మరిన్ని వివరాల కోసం దగ్గరలోని పీఈఆర్ ఐనాక్స్ లేదా యాప్‌ను సంప్రదించాలని గౌతమ్ దత్తా తెలిపారు.