Nara Lokesh: మాజీ సీఎం జగన్ కు మంత్రి లోకేశ్ హితవు

--
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం 2019లో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను చెల్లించలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపి వేశారని లోకేశ్ ఆరోపించారు.
సగం పూర్తయిన పనులను ధ్వంసం చేశారని విమర్శించారు. ఇది ఆయన నిరంకుశ మనస్తత్వాన్ని చాటిచెప్పిందని అన్నారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించడం సంప్రదాయమని లోకేశ్ చెప్పారు. విధ్వంస పాలనతో జగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రేక్ చేశారని విమర్శించారు. ప్రభుత్వం శాశ్వతమని, రాజకీయాలు ఎన్నికలు పూర్తయ్యేవరకేనని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు.