Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం... విద్యాశాఖ మూసివేత... తనదైన శైలిలో మస్క్ ట్వీట్

- అమెరికా విద్యాశాఖ మూసివేతకు ట్రంప్ ఆమోదం
- విద్యా వ్యవహారాలపై ఇకమీదట రాష్ట్రాలకే అధికారాలు
- ఈ మేరకు ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా విద్యాశాఖనే ఎత్తేశారు. ఈ మేరకు విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, దాని అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విద్యార్థుల ఫీజు రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన తీసుకున్న అత్యంత వినాశకరమైన చర్యలలో ఒకటని వారు అభివర్ణిస్తున్నారు.
విద్యాశాఖ అధికారాలను రాష్ట్రాలకు అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ తెలిపారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు ముందుకొచ్చారు. మిగిలిన సిబ్బందిని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మించి ఉన్న సిబ్బందిపై వేటు వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని లిండా మెక్‌మాన్ తెలిపారు.
కాగా, విద్యాశాఖ మూసివేతపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. విద్యాశాఖను ట్రంప్ సమాధి చేశారన్న అర్థం వచ్చేలా ఒక ఫొటోను పంచుకున్నారు.