Chandrababu Naidu: ఆ వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా: సీఎం చంద్ర‌బాబు

Andhra Pradesh CM Credits Venkateswara Swamy for Survival

  • నేడు నారా దేవాన్ష్ పుట్టినరోజు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్ర‌బాబు కుటుంబం
  • అన్న ప్రసాద కేంద్రంలో ప్రసాదాల వితరణ
  • 24 క్లేమోర్స్ పేలినా బతికున్నానంటే వేంకటేశ్వరస్వామి భిక్షతోనేన‌న్న ముఖ్య‌మంత్రి

సీఎం చంద్ర‌బాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. అనంతరం ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడారు. 

"రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్‌కు వచ్చే నిధులు పగడ్బందీగా ఖర్చు చేస్తాం. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం" అని చంద్రబాబు అన్నారు. 

వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా...

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయతీగా పెట్టుకున్న‌ట్లు పేర్కొన్నారు. 

తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించార‌న్నారు. ఇప్పటికి విరాళాల ద్వారా రూ.2,200 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటైంద‌ని, అన్నదానం ఒక మహత్తర కార్యక్రమమని సీఎం అభివ‌ర్ణించారు. ఇది శాశ్వతంగా జరుగుతుంద‌న్నారు. తాను ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించాన‌ని, మానవ సేవ మాధవ సేవ రెండూ ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. 

ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న సమయంలోనే త‌న‌పై 24 క్లేమోర్‌మైన్స్ పేల్చార‌ని తెలిపారు. అన్ని క్లేమోర్స్ పేల్చినా తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కార‌ణం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్ట‌డ‌మేన‌ని అన్నారు. ఎవ‌రైనా స‌రే... 24 క్లేమోర్ మైన్స్ పేలితే ప్రాణాలతో తప్పించుకోలేర‌ని, తాను కేవ‌లం వేంకటేశ్వరస్వామి మహిమ వల్లే బతికాన‌ని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News