Siddaramaiah: కర్ణాటక అసెంబ్లీలో 'హనీ ట్రాప్' రగడ... విచారణకు సిద్ధమైన ప్రభుత్వం

Honey Trap Scandal Rocks Karnataka Assembly

  • హనీ ట్రాప్ వివాదానికి తెరలేపిన మంత్రి రాజన్న
  • సీడీలు ప్రదర్శిస్తూ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • మంత్రులు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారన్న బీజేపీ సభ్యులు
  • సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
  • హనీ ట్రాప్ లో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లో హనీ ట్రాప్ దుమారం రేగింది. మంత్రులు సహా అనేకమంది హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హనీ ట్రాప్ అంశాన్ని లేవనెత్తారు. పలు సీడీలను ప్రదర్శిస్తూ, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హనీ ట్రాప్ అంశంలో నిగ్గు తేల్చాలంటూ సభలో నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు.

ఓ దశలో కాగితాలు చించి విసిరేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అదే ఊపులో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ నిజమే అని తేలితే, అందులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. అటు, హనీ ట్రాప్ కలకలం చెలరేగడంతో రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర ఉన్నతస్థాయి కమిటీ విచారణకు హామీ ఇచ్చారు. 

సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న గురువారం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ కు గురయ్యారని ఆయన ఆరోపించారు. 

దీనిపై బీజేపీ నేతలు సీడీలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. హనీట్రాప్ ఎవరు చేసినా అది తప్పేనని సిద్దరామయ్య అన్నారు. అయితే, బీజేపీ మాత్రం తమ ఆందోళనను విరమించలేదు. 

ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, "హనీట్రాప్ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంత డబ్బు కేటాయించింది?" అని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, "మీకు ఇంకేం కావాలి? విచారణ జరుగుతుందని చెప్పాం కదా" అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు, నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. "ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ - సీడీ ఫ్యాక్టరీ! సదాశివనగర్ సీడీ ఫ్యాక్టరీ!" అంటూ నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్‌లో నివాసం ఉంటున్నందున, ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈ నినాదాలు చేశారు. 

  • Loading...

More Telugu News