Chandrababu Naidu: ఏడు కొండలు... వెంకటేశ్వరస్వామి సొంతం: సీఎం చంద్రబాబు

Tirumala Temple Development Key Decisions by CM Chandrababu Naidu

  • తిరుమలలో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
  • భక్తులకు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని వెల్లడి
  • గత ఐదేళ్లలో అనేక దారుణాలు జరిగాయని వ్యాఖ్యలు
  • తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించామని స్పష్టీకరణ

నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. అన్నప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతరు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలామంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. ఏడు కొండలు వెంకటేశ్వరస్వామి సొంతం అని స్పష్టం చేశారు. ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని అన్నారు. 

గడచిన ఐదేళ్లలో చాలా  దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ  చెప్పానని... అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని వివరించారు. అప్పట్లో ఏడు కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్ కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్ కు 20 ఎకరాలు కేటాయించారని చంద్రబాబు విమర్శించారు. 

దీనిపై తాము చర్యలు తీసుకున్నామని, మరో 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను కూడా రద్దు చేశామని తెలిపారు. ఏడు కొండలను ఆనుకుని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని ఉద్ఘాటించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటులేదని స్పష్టంగా చెప్పామని అన్నారు. వెంకటేశ్వరస్వామి ఆస్తులన్నీ కాపడడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా ముందుకొస్తే త్వరితగతిన ఆలయ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. 

అంతేగాకుండా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News