Sumanbai Gaikwad: నాందేడ్ మహిళ పండించిన మామిడి పండు ధర రూ. 10 వేలు!

Indian Farmer Sells Mango for Rs 10000

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకీ’ రకాన్ని సాగు చేసిన మహిళా రైతు
  • ఒక్కో మొక్కకు రూ. 6,500 చొప్పున ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కలు తెప్పించిన సుమన్‌బాయి
  • రెండేళ్ల క్రితం సాగు మొదలు.. తాజాగా ఒక్కో చెట్టుకు 10 కాయలు
  • వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో పండుకు రూ. 10 వేల ధర పలికిన వైనం

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఓ మహిళా రైతు పండించిన మామిడిపండు ఒక్కోటి రూ. 10 వేలకు అమ్ముడుపోయింది. అంత ధర పలికేంత గొప్పదనం ఆ పండులో ఏముందనే కదా మీ సందేహం. ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకీ’ రకం. నాందేడ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్ ఈ మామిడిని సాగుచేశారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును రూ. 10 వేల చొప్పున విక్రయించారు.

ఈ రకం మామిడిని సాగు చేయడం వెనక ఓ కథ ఉంది. సుమన్‌బాయి కుమారుడు నందకిశోర్ యూపీఎస్సీ పరీక్షల కోసం పూణెలోని కోచింగ్ సెంటర్‌లో చేరారు. అయితే, కరోనా కారణంగా సెంటర్ మూతపడటంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు రెడీ అవుతున్న నందకిశోర్ ఆన్‌లైన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి గురించి తెలుసుకున్నాడు.

తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించి తల్లికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో దానికి రూ. 6,500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కలను తెప్పించి సాగు మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ ఏడాది కాపు వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా వాటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా ఒక్కో పండు రూ. 10 వేల చొప్పున అమ్ముడుపోయాయి.

  • Loading...

More Telugu News