Rana Daggubati: బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై స్పందించిన నటుడు రానా టీమ్

- నైపుణ్య ఆధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని వెల్లడి
- ఆయన చేసిన ప్రకటన గడువు 2017తో ముగిసిందన్న రానా టీమ్
- నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని వెల్లడి
బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు రానా టీమ్ స్పందించింది. రానా నైపుణ్యాధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని, అయితే ఆయన చేసిన ప్రకటన గడువు 2017తోనే ముగిసిందని వెల్లడించింది. బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు, ఈ యాప్‌లకు ప్రచారం చేసిన వారిపై విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో రానా బృందం ఈ ప్రకటన చేసింది.
రానా నైపుణ్యాధారిత గేమ్ యాప్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని రానా టీమ్ తెలిపింది. అదీ కూడా కొన్ని ప్రాంతాల వరకే ప్రసారమైందని వెల్లడించింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ప్రచారకర్తగా ఆమోదం తెలిపారని పేర్కొంది.
ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు రానా లీగల్ టీమ్ ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుందని తెలిపింది. చట్టపరమైన సమీక్ష తర్వాతే రానా యాప్ ప్రచారానికి అంగీకరించినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ రానా ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది.