Donald Trump: ఉక్రెయిన్ అంశంపై ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ .. పుతిన్ ఏమన్నారంటే..?

- పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్
- రెండు గంటల పాటు వివిధ అంశాలపై సంభాషణలు
- ఉక్రెయిన్ కు విదేశీ సాయం నిలిపివేస్తేనే పూర్తిగా కాల్పుల విరమణకు ఆలోచిస్తానన్న పుతిన్
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
ఇంతకు ముందే ట్రంప్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించి తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. 30 రోజుల కాల్పుల విరమణ జరుగుతున్న సమయంలో పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలో ఉక్రెయిన్ పవర్ ప్లాంట్లపై ఇక దాడులు చేయనని, మౌలిక సదుపాయాలు నాశనం చేయనని పుతిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
అయితే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు మాత్రం పుతిన్ అంగీకరించలేదని, ఉక్రెయిన్‌కు విదేశీ సాయం నిలిపివేస్తే అప్పుడు పూర్తి కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తానని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించకుండానే పుతిన్ షరతులు విధించారని అంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం పుతిన్‌తో చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇతర అంశాలపై రష్యాతో తమ ప్రతినిధి బృందం చర్చలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.