Elon Musk: సునీతా విలియమ్స్ రాకపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

- మేం ఎప్పుడో తీసుకొస్తామని చెప్పాం.. బైడెన్ ఒప్పుకోలేదన్న స్పేస్ ఎక్స్ అధినేత
- మా ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇంత ఆలస్యం జరిగేది కాదని వెల్లడి
- మరో సేఫ్ ల్యాండింగ్ అంటూ స్పేస్ ఎక్స్ సిబ్బందికి మస్క్ అభినందనలు
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరిన విషయం విదితమే. స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ‘క్రూ డ్రాగన్’ లో సునీత, బుచ్ విల్మోర్ లను తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఫ్లోరిడాలోని సముద్రంలో ల్యాండ్ అయిన అనంతరం స్పేస్ షిప్ నుంచి సునీతతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను నాసా అధికారులు వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ సందర్భంగా మరో సేఫ్ ల్యాండింగ్ నిర్వహించిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. అయితే, వారం రోజుల పరిశోధనల కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు స్పేస్ షిప్ లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని అక్కడే వదిలేసి స్టార్ లైనర్ స్పేస్ షిప్ వెనక్కి వచ్చింది.
ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములను వాపస్ తీసుకురావడానికి తమ కంపెనీ తరఫున బైడెన్ ప్రభుత్వానికి అప్పట్లోనే ప్రతిపాదన చేశామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సునీత, బుచ్ లను తీసుకువచ్చేందుకు మరో వ్యోమనౌకను పంపిస్తామని బైడెన్ కు ఆఫర్ ఇచ్చామని, రాజకీయ కారణాలతో ఆయన తిరస్కరించారని మస్క్ ఆరోపించారు. తమ ఆఫర్ కు బైడెన్ అంగీకారం తెలిపి ఉంటే వ్యోమగాములు ఇంతకాలం ఐఎస్ఎస్ లోనే ఉండిపోయే అవసరం ఉండేది కాదని అన్నారు. ఏదేమైనా సునీత, బుచ్ విల్మోర్ లు క్షేమంగా భూమికి తిరిగి రావడం సంతోషకరమని మస్క్ చెప్పారు. వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే ఆపరేషన్ లో పాలుపంచుకున్న నాసా, స్పేస్ ఎక్స్ సిబ్బందికి మస్క్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.