Anu Kumari: కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీలకు వెళ్లిన బాంబ్ స్క్వాడ్‌పై తేనెటీగల దాడి.. 70 మందికి గాయాలు

- కేరళలోని తిరువనంతపురంలో ఘటన
- తేనెటీగల దాడిలో గాయపడిన వారిలో ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసులు, సందర్శకులు
- కొందరు తీవ్రంగా గాయపడటంతో సెలైన్లు ఎక్కిస్తున్న వైద్యులు
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు రావడంతో తనిఖీలకు వెళ్లిన బాంబ్ స్క్వాడ్‌పై తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 70 మంది గాయపడ్డారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిందీ ఘటన. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్టు ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, పోలీసులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
బాంబ్ స్క్వాడ్ అణువణువూ గాలిస్తున్న సమయంలో భవనం వెనక ఉన్న తేనెతుట్టె నుంచి వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడిచేసింది. గాయపడిన వారిలో ప్రభుత్వాధికారులు, పోలీసులు, జర్నలిస్టులు, వివిధ పనులపై కలెక్టరేట్‌కు వచ్చిన వారు ఉన్నారు. వారందరూ తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో కొందరికి సెలైన్ కూడా ఎక్కించాల్సి వచ్చిందని తిరువనంతపురం కలెక్టర్ అను కుమారి తెలిపారు. బాంబు బెదిరింపు ఘటన ఇంతటి విపత్తుకు దారి తీస్తుందని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ఒక్కసారిగా ఇలా జరిగిపోయిందని వివరించారు.
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు మధ్యలో ఉండగానే ఈ ఘటన జరిగింది. కార్యాలయంలో ఎస్ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు అమర్చినట్టు ఈమెయిల్ వచ్చిందని, ఆ వెంటనే అందరినీ బయటకు పంపి పోలీసులకు ఫోన్ చేసినట్టు కలెక్టర్ వివరించారు. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలిందని పేర్కొన్నారు.