Gold Price: పసిడి ధరకు పట్టపగ్గాల్లేవ్!

- పరుగులు తీస్తున్న పసిడి ధరలు
- పది గ్రాముల 99.9 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.500 పెరిగి రూ.91,250కి చేరిన వైనం
- 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.450లు పెరిగి రూ.90,800కి చేరిక
- భారీగా బంగారాన్ని కొనుగోలుచేస్తున్న పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు
పసిడి ధరలకు అడ్డుకట్టే లేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులకు బంగారం షాక్ ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర పెరుగుతుండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా పది గ్రాముల బంగారం రూ.91 వేలు దాటి సరికొత్త రికార్డును నమోదు చేసింది. 99.9 ప్యూరిటీ గోల్డ్ మంగళవారం రూ.500 పెరిగి రూ.91,250కి చేరింది. అలాగే, 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.450 పెరిగి రూ.90,800కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి రూ.1,02,500లకు చేరి రికార్డు స్థాయిలో ఉంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీహెచ్)లో బంగారం ఫ్యూచర్స్ ధరలు 10 గ్రాములకు రూ.649 పెరిగి రూ.88,672కి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,028.49 డాలర్లకు చేరుకొని రికార్డు స్థాయికి చేరింది. కామెక్స్ లో బంగారం ఔన్స్ కు 3,037.26 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫెడ్ రిజర్వ్ నిర్ణయం బంగారం ధరను మరింత ప్రభావితం చేయనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా భారీగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి.