Posani Krishna Murali: పోసానితో జైలు గేటు వద్ద సీఐడీ పోలీసుల ఫొటోలు

- ఒక రోజు విచారణలో భాగంగా నిన్న సీఐడీ కార్యాలయానికి పోసానిని తీసుకొచ్చిన అధికారులు
- విచారణ అనంతరం తిరిగి జైలులో అప్పగింత
- జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో ఫొటోలు, సెల్ఫీలు
- పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టై, రిమాండ్‌లో ఉన్న సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు గుంటూరు సీఐడీ పోలీసులు క్యూకట్టారు. ఒక రోజు కస్టడీలో భాగంగా నిన్న ఉదయం ఆయనను జిల్లా జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ అనంతరం తిరిగి కోర్టులో హాజరుపరిచి జైలులో అప్పగించారు.
పోసాని జైలుకు వెళ్లే సమయంలో ఆయనతోపాటు వచ్చిన సీఐడీ పోలీసులు జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో ఫొటోలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమాండ్ ఖైదీతో పోలీసులు ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. జ్యుడీషియల్ ఖైదీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఇలా విధులను పక్కనపెట్టి ఫొటోలు తీసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.