Vijay Kumar: ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన సంతనూతలపాడు ఎమ్మెల్యే

- విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆటల పోటీలు
- క్రికెట్ ఆడుతూ కిందపడ్డ సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
- గాయపడిన ఎమ్మెల్యే ఆసుపత్రికి తరలింపు
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ పోటీలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ క్రీడా పోటీలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోవడంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కుట్లు వేయవలసి ఉండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలను మంగళవారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.