Vallabaneni Vamsi: ఏప్రిల్ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్ .. గన్నవరం కోర్టు ఆదేశాలు

- పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి వంశీని గన్నవరం కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు
- జైలులో పరుపు, ఫైబర్ కుర్చీ ఏర్పాటునకు వంశీ వినతి
- మెడికల్ సర్టిఫికెట్ అందజేస్తే దాని ఆధారంగా ఉత్తర్వులు ఇస్తామన్న కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీని మంగళవారం గన్నవరం పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వంశీపై నమోదైన భూ రిజిస్ట్రేషన్ వివాదం కేసులో కోర్టు అనుమతితో పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టుపై విచారణ జరిపిన గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది.
ఈ సమయంలో తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఏర్పాటుకు జైలు అధికారులకు ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ జరిపిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలు ఇవ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది.
మెడికల్ సర్టిఫికెట్లు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఏర్పాటు అంశంపై ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.