Nara Devansh: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చంద్రబాబు కుటుంబం

- మార్చి 21న నారా దేవాన్ష్ పుట్టినరోజు
- మార్చి 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబం
- అన్నప్రసాదం ఒక్కరోజు ఖర్చు రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వనున్న వైనం
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కుటుంబం ఎప్పట్లాగానే తిరుమలలో దేవాన్ష్ జన్మదినం జరుపనుంది. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అప్ డేట్ ఇచ్చారు.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబం ఈ నెల 20న తిరుమల రానుందని వెల్లడించారు. ఈ నెల 21న దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. మార్చి 21వ తేదీన ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు కుటుంబం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.