Water Tank Collapse: వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు.. ఆ వెంటనే కుప్పకూలడంతో ఇద్దరి మృతి

- మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలో ఘటన
- స్కూలు పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు
- మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
- ‘జల్ జీవన్’ మిషన్‌లో భాగంగా ట్యాంకు నిర్మాణం
సరదాగా ఎక్కిన వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో 12 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలోని సుఖదాంబ గ్రామంలో నిన్న జరిగిందీ ఘటన. చనిపోయిన ముగ్గురూ విద్యార్థులే. వారి స్కూలు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన వెంటనే దాని స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
‘జల్ జీవన్’ మిషన్‌లో భాగంగా ఈ వాటర్ ట్యాంకును నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు. ఇది ప్రమాదం కాదని, ఇది నేరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకును ఎంత నాణ్యతతో నిర్మించారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని, కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.