Tiger: ఆత్మరక్షణ కోసం పులిని హతమార్చిన అటవీ అధికారులు

- కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో ఘటన
- జనావాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బంది
- వారిపై దాడిచేసేందుకు యత్నించడంతో కాల్పులు
తమపై దాడిచేసేందుకు ప్రయత్నించిన పులి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అటవీ అధికారులు దానిని కాల్చి చంపారు. కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో జరిగిందీ ఘటన. అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని జనావాసాల్లోకి వచ్చిన పులి కొన్ని పశువులను చంపి తినేసింది.
గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నిన్న ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు వారు గుర్తించారు. దానికి మత్తుమందు ఇచ్చేందుకు 15 మీటర్ల దూరం నుంచి తొలుత కాల్పులు జరిపారు. దీంతో అది ఒక్కసారిగా వారిపైకి లంఘించి దాడిచేసేందుకు యత్నించింది. దీంతో ఆత్మరక్షణ కోసం వారు మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఆ పులి వయసు పదేళ్లు ఉంటుందని పేర్కొన్నారు.