Actor Shivaji: పోసాని కృష్ణమురళి అరెస్టుపై నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

- రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు ఎవరూ వెళ్లకూడదన్న శివాజీ
- తానూ 12 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నానన్న నటుడు
- ఏనాడూ ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని వెల్లడి
- పోసాని విషయంలో జరిగింది చాలు.. ఆయనకు రియలైజ్ కావడానికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అరెస్టుపై నటుడు శివాజీ స్పందించారు. తాను నటించిన ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని అరెస్టుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శివాజీ మాట్లాడుతూ... రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల వరకు ఎవరూ వెళ్లకూడదని అన్నారు. ఒకవేళ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శించే క్రమంలో ఎట్టిపరిస్థితుల్లో ఆయా వ్యక్తి కుటుంబం జోలికి మాత్రం వెళ్లకూడదని పేర్కొన్నారు. తానూ 12 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నానని, ఏనాడూ కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు.
అదే సరైన పద్దతి అని కూడా శివాజీ తెలిపారు. అలాంటప్పుడే మనం కూడా సేఫ్ ఉంటామని చెప్పారు. ఇక పోసాని విషయంలో జరిగింది చాలని, ఆయన రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, పోసానికి కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.