IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు.. టాప్-5లో ఒకే ఒక భారత ఆటగాడు!

- 175 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో టాప్‌లో క్రిస్ గేల్
- ఆ తర్వాతి స్థానంలో కివీస్ ప్లేయర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్ (158)
- మూడో స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ (140)
- టాప్-5లో ఏకైక భారత ఆటగాడు కేఎల్ రాహుల్ (132)
మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తెరలేవనుంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ అభిమానులకు వినోదాన్ని అందించనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ జాబితాలో టాప్‌లో ఉన్నది కరేబియన్ ఆటగాడు క్రిస్ గేల్ (ఆర్‌సీబీ). ఈ యూనివర్సల్ బాస్ అజేయంగా 175 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. 2013లో పుణే వారియర్స్ జట్టుపై 66 బంతుల్లోనే ఈ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకు గేల్ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు.
ఆ తర్వాతి స్థానంలో కివీస్ ప్లేయర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్ (కేకేఆర్) ఉన్నాడు. 2008లో జరిగిన ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఆర్‌సీబీపై 73 బంతుల్లోనే 158 రన్స్ బాదాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే తొలి మ్యాచ్. ఐపీఎల్ తొలి సీజన్ తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ భవిష్యత్తును సెట్ చేశాడని క్రికెట్ పండితులు మెక్ కల్లమ్ ను కొనియాడారు.
ఇక మూడో స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ (ఎల్ఎస్‌జీ) ఉన్నాడు. 2022 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌పై 70 బంతుల్లో 140 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాకే చెందిన మరో స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (ఆర్‌సీబీ) నాలుగో స్థానంలో ఉన్నాడు. 2015లో ముంబయి ఇండియన్స్ పై 59 బంతుల్లోనే 133 రన్స్ చేశాడు. కాగా, ఈ జాబితాలో ఉన్న ఏకైక భారత ఆటగాడు కేఎల్ రాహుల్. 2020లో పంజాబ్‌కు ఆడిన అతడు... ఆర్‌సీబీపై 69 బంతుల్లో 132 రన్స్ కొట్టాడు.