Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే!

Mumbai Indians Star Corbin Bosch Breaches PSL Contract To Join IPL Fuming PCB Sends Legal Notice

  • ఆల్ రౌండర్ కార్బిన్‌ బోష్ కు లీగల్ నోటీసులు జారీ చేసిన పీసీబీ 
  • ముందుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు పెషావర్‌ జల్మి జట్టుతో ఒప్పందం
  • ఆ త‌ర్వాత హఠాత్తుగా ఎంఐతో ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణం

ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆల్ రౌండర్ కార్బిన్‌ బోష్ కు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తాజాగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ముందుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్ (పీఎస్ఎల్‌)లో ఆడేందుకు అంగీకరించి, హఠాత్తుగా ఐపీఎల్ లో ఎంఐతో ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణం. ద‌క్షిణాఫ్రికాకు చెందిన బోష్ ఈ ఏడాది పాకిస్థాన్‌ మీదే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటడం వల్ల అతడిని పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ పెషావర్‌ జల్మి తమ జట్టులోకి తీసుకుంది. జనవరి 13న లాహోర్‌లో జరిగిన పీఎస్ఎల్‌ ప్లేయర్స్ డ్రాఫ్ట్ పదో ఎడిషన్ సందర్భంగా ఆ ఫ్రాంచైజీ బోష్ ను కొనుగోలు చేసింది. 

అయితే, గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో తాము కొన్న దక్షిణాఫ్రికా పేసర్‌ లిజాడ్‌ విలియమ్స్‌ గాయపడడం వల్ల ముంబయి ఇండియన్స్‌ అతడి స్థానాన్ని బోష్ తో భర్తీ చేసుకుంది. అయితే బోష్ ముందు పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకుని, ఇప్పుడు ముంబయి జట్టుకు మారడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అత‌నికి లీగల్ నోటీసులు పంపింది. లీగ్ నుంచి నిష్క్రమించడం వల్ల ఎదురయ్యే పరిణామాలను బోష్ కు వివరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరింది.

ఇక 2016లో పీఎస్ఎల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకేసారి జరగలేదు. ఈసారి మాత్రం రెండు లీగ్ లు కొద్ది రోజుల వ్యవధిలోనే జరుగుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ ముందు జరుగుతుంది. కానీ, ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించాల్సి రావడం వల్ల పీఎస్ఎల్ ఆలస్యం అయింది. ఐపీఎల్‌ మొదలైన రెండు వారాలకు పీఎస్‌ఎల్‌ ప్రారంభం కానుంది. దీంతో బోష్‌ పీఎస్‌ఎల్ కు దూరమై, ఐపీఎల్ లోనే కొనసాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది. 

కాగా, ఐపీఎల్ 2025 మ‌రో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల‌ 22న మెగా టోర్నీకి తెర‌లేవ‌నుంది. తొలి మ్యాచ్ కు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. 

  • Loading...

More Telugu News