Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ

Annapurnamma Interview

  • తల్లిదండ్రులు పొరపాటు చేస్తున్నారన్న అన్నపూర్ణ 
  • పిల్లలకు కష్టం తెలియాలంటూ చేసిన సూచన 
  • సెన్సిటివ్ గా పెంచితే ఇబ్బందులు తప్పవని వ్యాఖ్య
  • ఎదుటివారితో పోల్చుకోకూడదని వెల్లడి 

తెలుగు తెరపై అమ్మ పాత్రలకు పెట్టింది పేరు అన్నపూర్ణమ్మ. వందలాది సినిమాలలో నటించిన అన్నపూర్ణమ్మ మంచి మాటకారి అనే విషయం చాలామందికి తెలుసు. అలాంటి ఆమె తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఇప్పటి పిల్లలు మూర్ఖంగా తయారవడానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు అడగ్గానే డబ్బు ఇచ్చేస్తూ ఉండటం వలన వాళ్లకి కష్టం తెలియకుండా పోతోంది"అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించకపోవడం వలన, వారి మనసులో ఏముందో తెలుకునే అవకాశం లేకుండా పోతోంది. దాంతో చిన్న కష్టానికి కూడా తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఈ కాలంలో లవ్ విషయానికి వస్తే .. అది శుద్ధ అబద్ధమనే చెప్పాలి. కొంతమంది పిల్లలు కొన్ని ఆకర్షణలకు లోనై తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. అందువలన పిల్లలు కాస్త ఆలోచన చేయాలి" అని అన్నారు. 

"ఇక ఈ రోజుల్లో చాలామంది అత్యాశకు పోతున్నారు. ఎదుటివారికి ఏదుంటే అది తమకి కూడా ఉండాలని భావిస్తున్నారు. దాంతో తాహతు లేకపోయినా కార్లు... ఫ్లాట్లు కొంటున్నారు. అందుకు అవసరమైన డబ్బు కోసం మోసాలు చేస్తున్నారు. దార్లో కంకరరాళ్లు ఉన్నాయిగదా అని గెంతుతూ వెళ్లకూడదు. మంచి రోడ్డు వచ్చేవరకూ నిదానంగా నడవాలి. జీవితం పట్ల కూడా అలాగే ఉండాలి. అత్యాశకు పోనంతవరకూ ఆరోగ్యంగా ఉంటాం... ఆరోగ్యం బాగున్నంత వరకూ హాయిగా ఉంటాం" అని చెప్పారు.    

Annapurnamma
Actress
Tollywood
  • Loading...

More Telugu News