AR Rahman: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై వైద్యులు ఏంచెప్పారంటే..?

- డీహైడ్రేషన్ వల్లే రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు
- రంజాన్ ఉపవాసం, లండన్ నుంచి ప్రయాణం చేసి రావడంతో అస్వస్థత
- ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్న వైద్యులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై వైద్యులు వెల్లడించిన వివరాలు.. రెహమాన్ డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం ఉండడం, లండన్ నుంచి ప్రయాణం చేసి రావడంతో శనివారం రాత్రి అసౌకర్యంగా ఫీలయ్యారని రెహమాన్ అధికార ప్రతినిధి తెలిపారు.
చెన్నైలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అస్వస్థతకు గురవడంతో రెహమాన్ ను అపోలో ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, ఈకో కార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అయితే, ఉపవాసం కారణంగా రెహమాన్ డీహైడ్రేషన్ కు గురయ్యారని వైద్యులు చెప్పినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం రెహమాన్ కోలుకుంటున్నారని వివరించారు.