USA: పోలాండ్ లో అణ్వాయుధాలు మోహరించాలన్న విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

- అమెరికా అణ్వాయుధాలు తమ దేశంలో మోహరించాలన్న పోలాండ్
- గతంలోనూ పోలాండ్ నుంచి ఇదే తరహా విజ్ఞప్తి
- అలాంటి ఆలోచన తమకు లేదన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
రష్యా దూకుడును నిలువరించేందుకు తమ దేశంలో అమెరికా అణ్వాయుధాలను మోహరించాలన్న పోలాండ్ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వెల్లడించారు.
అమెరికా తన అణ్వాయుధాలను పశ్చిమ ఐరోపాలో కాకుండా పోలాండ్‌లో భద్రపరచాలని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డూడా గతంలో ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారు.
ఈ విషయంపై స్పందిస్తూ, తాను ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించినట్టు వాన్స్ తెలిపారు. తూర్పు యూరప్ సరిహద్దులకు అణ్వాయుధాల విస్తరణకు ట్రంప్ మద్దతు ఇస్తే తాను ఆశ్చర్యపోతానని ఆయన అన్నారు. బైడెన్ ప్రభుత్వం నిద్రమత్తులో తూగుతూ ఒక అణు సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా మాస్కో, కీవ్‌లను రక్తసిక్తం చేశారని ఆయన ఆరోపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధమే వచ్చేది కాదని వాన్స్ అభిప్రాయపడ్డారు.
సరిహద్దుల్లోకి నాటో దళాలు రావడంపై రష్యా ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. ఈ సమయంలో, ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న తరుణంలో పోలాండ్ అణ్వాయుధాల మోహరింపు కోసం అభ్యర్థించడం గమనార్హం.