Bengaluru: 4 రోజులు, 3 రాత్రుల బెంగళూరు టూరిజం... ట్రాఫిక్‌పై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ సెటైర్

Pais Sarcastic Take on Bengaluru Traffic Woes

  • బెంగళూరు ట్రాఫిక్‌పై పాయ్ వ్యంగ్య ట్వీట్
  • నగర మౌలిక సదుపాయాలపై అసహనం  
  • భిన్నంగా స్పందించిన నెటిజన్లు
  • ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలు

ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ, ప్రముఖ ఆర్థికవేత్త మోహన్‌దాస్ పాయ్ బెంగళూరు నగర ట్రాఫిక్ కష్టాలపై వినూత్నంగా స్పందించారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్, మారతహళ్లి, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను చూపిస్తూ "4 రోజులు, 3 రాత్రుల బెంగళూరు టూరిజం" అంటూ వ్యంగ్యంగా ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీని ద్వారా నగరంలో ట్రాఫిక్ ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

బెంగళూరు నగర మౌలిక సదుపాయాల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది బెంగళూరుకు ఒక విషాదకరమైన జోక్ అని అభివర్ణిస్తూ, తమ బాధను చూసి నవ్వుకునే మనసు తమకుందని, కానీ పట్టించుకోని ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందించారు. "మీరు చాలా విమర్శలు చేస్తున్నారు... బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు మీ పరిష్కారం ఏమిటి? సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలా? దయచేసి కొన్ని ఆచరణాత్మక సూచనలు చేయండి, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరొకరు "నేను ప్రతిరోజూ ఆ యాత్ర చేస్తాను, నా భావాలను ఇంతకంటే బాగా వ్యక్తం చేయలేను" అని సరదాగా అన్నారు.

"పరిశ్రమ మరియు పారిశ్రామిక దిగ్గజాలు హైబ్రిడ్ పని విధానాన్ని లేదా ఇంటి నుండి మరింత పని విధానాన్ని ప్రోత్సహించాలి. ఇది బెంగళూరు ఉద్యోగులకు కనీసం ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేసేందుకు వీలు కల్పిస్తుంది. లేదంటే ప్రతిరోజూ చార్ జామ్స్ తప్పవు!" అని ఒక నెటిజన్ సూచించారు.

More Telugu News