Karnataka: రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు ఉపసంహరణపై స్పందించిన హోంమంత్రి

- సీఐడీ దర్యాప్తు ఉపసంహరణలో తనపై ఒత్తిడి లేదన్న కర్ణాటక హోంమంత్రి
- కేసును సిబ్బంది, పాలనా సంస్కరణల విభాగంతో దర్యాఫ్తు చేయించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడి
- ఒకేసారి రెండు దర్యాప్తులు అనవసరమన్న జి. పరమేశ్వర
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకోవడంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. రన్యా రావు కేసులో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకుంది. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జి. పరమేశ్వర పైవిధంగా స్పందించారు.
రన్యా రావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ అధికారి అయినందువల్లే ఈ కేసును సిబ్బంది, పాలనా సంస్కరణల విభాగంతో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. ఒకేసారి రెండు దర్యాప్తులు అనవసరమని తెలిపారు. అందుకే సీఐడీని తప్పించినట్లు చెప్పారు.
రన్యా రావు పెళ్లికి ముఖ్యమంత్రి కూడా హాజరైన విషయాన్ని మీడియా ప్రశ్నించింది. ఆయన వేల వివాహాలకు హాజరయ్యారని హోంమంత్రి సమాధానమిచ్చారు.
దర్యాఫ్తు ముమ్మరం చేసిన ఈడీ
రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా బెంగళూరు సహా అనేక చోట్ల దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరంలోనే ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యా రావుతో పాటు మరికొందరి పాత్ర ఉండి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల పాత్రపై ఈడీ దృష్టి సారించింది. సాక్ష్యాలను వెలికితీసేందుకు సీబీఐ, డీఆర్ఐలతో సమన్వయం చేసుకుంటున్న ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ఇటీవల కేసు నమోదు చేసింది.