Mitchell Starc: భారత్‌కు మాత్రమే ఆ సత్తా ఉంది.. టీమిండియా సమస్యల్ని పరిష్కరించేది కేఎల్ రాహుల్: మిచెల్ స్టార్క్

- భారత క్రికెట్‌లోని నైపుణ్యంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు
- ఒకేరోజు మూడు ఫార్మాట్లకు వేర్వేరు బలమైన జట్లను పంపించగల సత్తా భారత్‌కు మాత్రమే ఉందని కితాబు
- కేఎల్ రాహుల్‌ను టీమిండియా 'మిస్టర్ ఫిక్సిట్' అని పేర్కొన్న ఆసీస్ పేసర్
భారత క్రికెట్‌లోని నైపుణ్యంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో టీమిండియా సమస్యల్ని పరిష్కరించే ఆటగాడిగా కేఎల్ రాహుల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు ఆసీస్ స్టార్.
ఒకేరోజు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులు పెడితే వాటన్నింటికీ వేర్వేరు బలమైన జట్లను పంపించగల సత్తా భారత్‌కు మాత్రమే ఉందన్నాడు. మరే ఇతర దేశం ఆటలోని మూడు ఫార్మాట్లలో ఒకేసారి నాణ్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను సమీకరించలేదని నొక్కి చెప్పాడు.
ఈ మేరకు ఫనాటిక్స్ యూట్యూబ్ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ స్టార్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్‌ను టీమిండియా 'మిస్టర్ ఫిక్సిట్' అని పేర్కొన్నాడు. టీమిండియా సమస్యల్ని పరిష్కరించే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ ఉన్నారని తెలిపాడు. ఓపెనింగ్, కీపింగ్, ఫీల్డింగ్, ఫినిషింగ్ ఇలా ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని స్టార్క్ కొనియాడాడు.
కాగా, రాహుల్‌తో పాటు స్టార్క్ ఈసారి ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు ప్రాతినిధ్యం వహించబోతున్న విషయం తెలిసిందే. ఆసీస్ స్పీడ్‌స్టర్‌ను మెగా వేలంలో డీసీ ఫ్రాంచైజీ రూ. 11.75 కోట్లకు కొనుగోలు చేయగా, రాహుల్‌ను రూ. 14 కోట్లకు తీసుకుంది.