Revanth Reddy: తెలంగాణలో నిర్వహించే సమ్మిట్‌కు బరాక్ ఒబామా హాజరయ్యే అవకాశం: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Obama may attend to Bharath Summit

  • ఏప్రిల్‌లో భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడి
  • గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శ
  • మెట్రో రైలు హైదరాబాద్‌కు గేమ్ ఛేంజర్ అన్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో 'భారత్ సమ్మిట్' పేరిట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సమ్మిట్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు నిర్మహించే ఈ సమ్మిట్‌కు అరవై దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. విదేశాంగ శాఖ అనుమతుల కోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ను కలవనున్నట్లు చెప్పారు.

గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగే చర్చకు ఆయన హాజరు కావాలని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగాన్ని 8.8 శాతం నుండి 6.1 శాతానికి తగ్గించామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకు వచ్చామని అన్నారు. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందంజలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. 

నేనెవరో తెలియకుండానే ముఖ్యమంత్రిగా చేశారా?

గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన చెప్పారు వారితో ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని ముఖ్యమంత్రి తెలిపారు. నేను ఎవరో తెలియకుండా తనను పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చేశారా? అని ప్రశ్నించారు. తాను ఎవరి ట్రాప్‌లో పడనని పేర్కొన్నారు.

తమిళనాడు కంటే ముందే మన వద్ద సమావేశం

లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అనేది దక్షిణాదికి సీట్ల విషయంలో నష్టం చేసేదని అన్నారు. ఈ అంశంపై అఖిల పక్ష సమావేశానికి మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసినట్లు చెప్పారు. తమిళనాడులో సమావేశం కంటే ముందే మన రాష్ట్రంలో అఖిల పక్ష సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అందరి అభిప్రాయ సేకరణ తర్వాతే డీఎంకే సమావేశంపై తమ వైఖరి చెబుతామని అన్నారు.

తెలంగాణకు రావాల్సిన వాటిని కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదు

రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకు రావాలని తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరుతున్నానని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, కేంద్ర ప్రాజెక్టులు ఇవ్వాలని అడుగుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మెట్రో హైదరాబాద్‌కు గేమ్ ఛేంజర్

మెట్రోకు కేంద్ర మంత్రివర్గం అనుమతిస్తే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెట్రో విస్తరణ హైదరాబాద్  కు గేమ్ ఛేంజర్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో తమిళనాడులో మెట్రో ప్రకటనలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మామునూరు ఎయిర్ పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని, అందుకే పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల కాలంలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News