Danish Kaneria: పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు.. క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్!

- పాక్‌లో తాను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నట్లు తెలిపిన కనేరియా
- తన క్రికెట్ కెరీర్ నాశనం కావడానికి అదే ప్రధాన కారణమని వెల్లడి
- మైనారిటీని కావడంతో తనకు జట్టులో తగిన గౌరవం దక్కలేదన్న మాజీ క్రికెటర్
- అఫ్రిది తనను మతం మారమని ఒత్తిడి చేశాడన్న కనేరియా
- తనకు మద్దతుగా నిలిచింది కెప్టెన్ ఇంజమామ్ మాత్రమేనన్న స్పిన్నర్
పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిశ్ కనేరియా తన తోటి ప్లేయర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పిన్నర్ మాట్లాడుతూ... పాక్‌లో తాను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తన క్రికెట్ కెరీర్ నాశనం కావడానికి అదే ప్రధాన కారణమని చెప్పాడు. మైనారిటీని కావడంతో తనకు జట్టులో తగిన గౌరవం దక్కలేదన్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉండడంతో పాక్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష, ఇబ్బందులపై మాట్లాడే అవకాశం దక్కిందని తెలిపాడు.
అలాగే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డాడు. అఫ్రిది తనను అనుక్షణం మతం మారమని ఒత్తిడి చేసేవాడని, షోయబ్ అక్తర్ సహా ఇతర ఆటగాళ్లు కొందరు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కనేరియా అన్నాడు. కనీసం తనతో కలిసి భోజనం కూడా చేసేవారు కాదని వాపోయాడు. ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే తనకు మద్దతుగా నిలిచిన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మతం మారమని చెప్పలేదని, తనతో మర్యాదగా ఉండేవాడని చెప్పుకొచ్చాడు. ఇక పాక్ తరఫున 61 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన కనేరియా ఆ జట్టు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.