Vladimir Putin: యుద్ధ భూమిలో పుతిన్ .. ట్రంప్ హెచ్చరికలు

- తొలిసారిగా యుద్దభూమిలోకి అడుగుపెట్టిన పుతిన్
- మిలటరీ డ్రస్‌లో ఉన్న పుతిన్ ఫోటోలు మీడియాకు
- యుద్దం కొనసాగితే మాస్కోకు తీవ్ర నష్టమన్న ట్రంప్
అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బుధవారం పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో పర్యటించారు.
ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్క్స్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు అధ్యక్షుడు పుతిన్ వెళ్లారు. ఆయన మిలటరీ డ్రస్‌లో ఉన్న ఫొటోలను మీడియా ప్రసారం చేసింది.
యుద్ధ భూమిలోని పరిస్థితులను అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్ వివరించారు. కొంత మంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలవడ్డాయి.
మరో పక్క యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వద్ద మీడియాతో డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నానని, లేదంటే యుద్దం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది రష్యాకే వినాశకరంగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే అలాంటి పలితాన్ని తాను కోరుకోవడం లేదని, శాంతి స్థాపనే లక్ష్యమని ట్రంప్ వివరించారు.