Mahmudullah: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లా స్టార్ క్రికెటర్ గుడ్‌బై!

- అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మదుల్లా
- 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం
- బంగ్లా తరఫున 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లకు ప్రాతినిధ్యం
- అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 రన్స్ చేసిన స్టార్ ఆల్ రౌండర్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు 17 సంవత్సరాలకు పైగా బంగ్లా క్రికెట్ జట్టుకు తన సేవలు అందించాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా బుధవారం సోషల్ మీడియాలో తన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
"నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నా సహచరులు, కోచ్‌లు, ముఖ్యంగా నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చిన నా అభిమానులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులు, నా అత్తమామలకు ధన్యవాదాలు. ముఖ్యంగా నా సోదరుడు ఎమ్దాద్ ఉల్లా.. చిన్నప్పటి నుంచి నా కోచ్, మెంటార్‌గా ఉన్నందుకు అతనికి చాలా ధన్యవాదాలు" అని మహ్మదుల్లా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
కాగా, 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహ్మదుల్లా... బంగ్లాదేశ్ తరఫున 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశాడు. అలాగే స్పిన్నర్ అయిన మహ్మదుల్లా టెస్టుల్లో 42 వికెట్లు, వన్డేల్లో 81, టీ20ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.
ఇక బంగ్లా జట్టులో అత్యంత విశ్వసనీయమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన మహ్మదుల్లా, వన్డే ప్రపంచ కప్‌లలో మూడు సెంచరీలు చేసిన ఏకైక బంగ్లా క్రికెటర్. వాటిలో రెండు శతకాలు 2015 ఎడిషన్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై వచ్చాయి. ఆ సీజన్‌లో బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతని మూడో సెంచరీ 2023 ఎడిషన్‌లో వచ్చింది.