Posani Krishna Murali: జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట... పోసానికి 14 రోజుల రిమాండ్

- పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు
- పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు
- గుంటూరు జిల్లా జైలుకు పోసాని తరలింపు
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
పోసానిపై ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో... గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ ను కొట్టివేయాలని ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా... ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
మరోవైపు కర్నూలు నుంచి గుంటూరుకు పోసానిని తీసుకెళ్లిన పోలీసులు... ఆయనను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనల సమయంలో జడ్జి ఎదుల పోసాని భోరున విలపించారు. తన ఆరోగ్యం బాగోలేదని... బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. ఇరువైపు వాదనలను విన్న జడ్జి... పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.