Crime News: పెళ్లి చూపులు చూసిందొకరు.. పెళ్లికొడుకుగా వచ్చిందొకరు.. వధువు కుటుంబానికి షాక్

- ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఘటన
- వరుడిగా వచ్చిన యువకుడితోపాటు ఏడుగురి అరెస్ట్
- ఇది నకిలీ మ్యారేజ్ బ్రోకర్ల పనే అంటున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. గ్రామంలోని ఓ యువతికి హరియాణాలోని పానిపట్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కుమార్తె తరపు బంధువులు వరుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ముహూర్త సమయానికి బంధువులతో కలిసి పెళ్లికొడుకు మండపానికి చేరుకున్నాడు. కానీ, అతడిని చూసి అందరూ షాకయ్యారు. పెళ్లికొడుకు స్థానంలో మరో యువకుడు రావడంతో అందరూ నిర్ఘాంతపోయారు. చివరికి తేరుకొని మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యవర్తిగా ఉన్న ఓ మహిళ వధువు తల్లిదండ్రులకు ఓ యువకుడి ఫొటో పంపింది. సదరు యువకుడు నచ్చడంతో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే, వరుడి బదులు మరో యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో వధువు కుటుంబం విస్తుపోయింది. మధ్యవర్తిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి కొడుకుగా వచ్చిన పవన్ కుమార్, అతడి బంధువులు, మధ్యవర్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇది నకిలీ మ్యారేజ్ బ్రోకర్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కుదిర్చి, ఆపై డబ్బు, బంగారంతో ఈ ముఠా ఉడాయిస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.