US Stock Market: కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్

- ట్రంప్ దూకుడు నిర్ణయాలతో అనిశ్చితి
- మరోవైపు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ భయాలు
- ఒక్కరోజులో రూ.349 లక్షల కోట్ల సంపద ఆవిరి
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ విప్లవాత్మకమైన చర్యలతో ముందుకుపోతున్నారు. అమెరికా ఎగుమతులపై సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ టారిఫ్ సవరణలకు తెరలేపారు. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
తాజాగా నెలకొన్న అనిశ్చితితో అమెరికా మార్కెట్లు సోమవారం నాడు కుప్పకూలాయి. నాస్డాక్, డౌజోన్స్, ఎస్ అండ్ పీ వంటి సూచీలు భారీగా పతనం అయ్యాయి. నాస్డాక్ 4 శాతం, డౌజోన్స్ 1.3 శాతం, ఎస్ అండ్ పి 2.5 శాతం నష్టాలు చవిచూశాయి. ఏకంగా రూ.349 లక్షల కోట్ల మేర ఇన్వెసర్ల సంపద ఆవిరైంది.
ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు సైతం 15 శాతం మేర కుదేలైంది. అమెరికా సమాఖ్య ప్రభుత్వ షట్ డౌన్, ట్రంప్ దూకుడు నిర్ణయాలు మార్కెట్ ను కుదిపేస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో, నేడు భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.