Tattoo: పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారా?.. అయితే ఇది మీకోసమే!

- పచ్చబొట్లతో క్యాన్సర్ ముప్పు
- లింఫోమా ముప్పు మూడు రెట్లు అధికమన్న అధ్యయనకారులు
- సిరా శరీరం లోనికి వెళ్లి లింఫ్ గ్రంథుల్లో పోగుపడే అవకాశం
- పెద్ద పచ్చబొట్లతో మరింత ప్రమాదం
- డెన్మార్క్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
పచ్చబొట్లపై మనసు పారేసుకునేవారు ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. వాటితో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని డెన్మార్క్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అరచేతి కన్నా పెద్ద పరిమాణంలో ఉండే పచ్చబొట్లతో చర్మ క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. లింఫోమా ముప్పు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు దాని సిరా రేణువులు శరీరం లోపలికి వెళ్లి లింఫ్ గ్రంథుల్లో పోగు పడే అవకాశం ఉందని అధ్యయనకారులు పేర్కొన్నారు. అలాగే, పచ్చబొట్లతో క్యాన్సర్ వచ్చే ముప్పు 33 శాతం నుంచి 62 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది.
జన్యు, పర్యావరణ పరంగా ఒకే తరహా లక్షణాలను పంచుకునే కవలలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పచ్చబొట్టు పొడిపించుకోని కవలలతో పోలిస్తే పొడిపించుకున్న కవలలకు చర్మ, లింఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, పచ్చబొట్టును ఎంత మందంగా, ఎంత పెద్దగా పొడిపించుకుంటే అంత ఎక్కువగా దాని సిరా లింఫ్ గ్రంథుల్లో పోగుపడుతున్నట్టు తేలింది. అయితే, ఈ సిరా లింఫ్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందని కానీ, ఇతర జబ్బులకు కారణమవుతుందని కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. పచ్చబొట్టులో వాడే కొన్ని రంగులు ఆరోగ్యానికి మంచివి కావు. అయితే, తాజా పరిశోధనలో పచ్చబొట్టులో వాడే సిరాల రంగు, క్యాన్సర్ల మధ్య స్పష్టమైన సంబంధం కనిపించకపోవడం గమనార్హం.