Karnataka: రూ. 4,08,647 కోట్లతో కర్ణాటక వార్షిక బడ్జెట్... సినిమా టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్న సిద్ధరామయ్య ప్రభుత్వం

- సినిమా టికెట్ ధరలను రూ. 200గా నిర్ణయించాలనుకుంటున్న ప్రభుత్వం
- మల్టీప్లెక్స్ సహా అన్ని థియేటర్లలో ఇదే రేటు ఉంటుందన్న సీఎం
- మైసూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మిస్తామని వెల్లడి
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ. 4,08,647 కోట్ల బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, సినిమా ప్రమోషన్స్ తదితర అంశాలను బడ్జెట్ లో కీలకంగా ప్రస్తావించారు.
సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు టికెట్ ధరలను రూ. 200గా నిర్ణయించాలనుకుంటున్నట్టు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మల్టీప్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే టికెట్ ధర ఉంటుందని చెప్పారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని చెప్పారు. దీని నిర్మాణానికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.