Vijay: ఎంపీ స్థానాల పునర్విభజనపై హీరో విజయ్ ఆందోళన

- జనాభా లెక్కల ఆధారంగా ఎంపీ స్థానాల పునర్విభజన చేయాలనుకుంటున్న కేంద్రం
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విజయ్
- యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాలు పెరిగితే సహించబోమని హెచ్చరిక
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వానికి, పలు రాష్ట్రాల్లోని పార్టీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే అంశంపై తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ స్పందిస్తూ.... పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు.
జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే... పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని విజయ్ అన్నారు. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోమని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ గత 50 ఏళ్లుగా జనాభా పెరుగుదలను నియంత్రించాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గినా... యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాలు పెరిగినా సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామని చెప్పారు.