Teenmaar Mallanna: భ్రమల్లో నుంచి రేవంత్ బయటకు రావాలి... 2028లో బీసీ నేత సీఎం కావడం ఖాయం: తీన్మార్ మల్లన్న

Teenmaar Mallanna fires on Revanth Reddy

  • తనను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ భ్రమపడుతున్నారన్న మల్లన్న
  • కులగణనపై రేవంత్ తో తాను చర్చకు సిద్ధమని వ్యాఖ్య
  • కేసీఆర్ తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్న

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి తనను రేవంత్ సస్పెండ్ చేయించారని మండిపడ్డారు. తనను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందననే భ్రమల్లో నుంచి రేవంత్ బయటకు రావాలని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తామని చెప్పారు. రేవంత్ కు నచ్చకపోయినా... 2028లో బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే కులగణనను తప్పుగా చూపారని చెప్పారు.  

90 ఏళ్ల తర్వాత కులగణన చేస్తే చప్పట్లు కొట్టేవాడు ఒకడు కూడా లేడని అన్నారు. కులగణనపై రేవంత్ తో చర్చకు తాను సిద్ధమని చెప్పారు. పక్కనున్న వాళ్లు బానిసలుగా బతకాలనేది రేవంత్ వ్యక్తిత్వమని విమర్శించారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానమని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని మల్లన్న అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఒక న్యాయం... తనకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలకు కాంగ్రెస్ లో స్వేచ్ఛ లేదని అన్నారు. పప్పు, బెల్లం మాదిరి రెడ్లు కార్పొరేషన్ పదవులను పంచుకున్నారని విమర్శించారు. 

రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని మల్లన్న ఆరోపించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి స్థానాల నుంచి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి... తనను గెలిపించారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బలమైన కేసీఆర్ తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీకి పునాది పడటానికి తానే కారణమని చెప్పారు. 

Teenmaar Mallanna
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News