Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు

- స్టోన్ క్రషర్ యజమానుల నుంచి రూ. 2.20 కోట్ల వసూళ్లు
- విడదల రజనిని విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరిన ఏసీబీ
- ఐపీఎస్ అధికారి జాషువాను విచారించేందుకు సీఎస్ అనుమతి
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనికి ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రూ. 2.20 కోట్లను వసూలు చేశారన్న అభియోగాలతో ఆమెపై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది. విడదల రజనిని విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన వెంటనే ఆమెపై కేసు నమోదు చేస్తారు. మరోవైపు ఇదే కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను విచారించేందుకు చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీ అధికారులు అనుమతిని తీసుకున్నారు.
విడదల అక్రమ వసూళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని... చివరకు రూ. 2.20 కోట్లు వసూలు చేశారని నివేదికలో పేర్కొంది. ఇందులో రజనికి రూ. 2 కోట్లు, జాషువాకు రూ. 10 లక్షలు, రజని పీఏకు రూ. 10 లక్షలు చెల్లించారని తెలిపింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో కేసు నమోదుకు కావాల్సిన అనుమతులను ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.