Padmakar Shivalkar: దిగ్గజ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ కన్నుమూత

- దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరుపొందిన పద్మాకర్ శివాల్కర్
- 21 ఏళ్ల వయసులో కెరియర్ ప్రారంభం
- 47 ఏళ్ల వరకు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం
- 13 సార్లు 10 వికెట్లు, 42 సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన పద్మాకర్
- 124 మ్యాచ్‌ల్లో 589 వికెట్లు పడగొట్టిన స్టాల్‌వార్ట్
దేశం అందించిన అత్యుత్తమ లెఫ్టార్మ్ స్పిన్నర్లలో ఒకరైన ముంబైకి చెందిన పద్మాకర్ శివాల్కర్ మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. రెండు దశాబ్దాలకు పైగా ముంబై జట్టుకి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే, అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరుగాంచినప్పటికీ, అదే సమయంలో మరో దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ భారత జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ శివాల్కర్ మాత్రం భారత జాతీయ జట్టుకు ఆడలేకపోయారు.
శివాల్కర్ మృతికి సునీల్ గవాస్కర్ సంతాపం తెలిపారు. ముంబైకి ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన మిలింద్, పద్మాకర్ వంటి వారిని స్వల్ప వ్యవధిలో కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. గవాస్కర్ తన పుస్తకం ‘ఐడల్స్’లో శివాల్కర్‌ను ఒక ‘ఐడల్’గా అభివర్ణించారు.
శివాల్కర్ 1961/62 సీజన్‌లో 21 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ కెరియర్ ప్రారంభించారు. అలా 47 ఏళ్ల వరకు అంటే 1987/88 సీజన్ వరకు ముంబైకి ఆడారు. మొత్తం 124 మ్యాచ్‌లు ఆడి 589 వికెట్లు పడగొట్టారు. 42 సార్లు 5 వికెట్లు, 13 సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 1972/73 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో 16 పరుగులకు 8 వికెట్లు, 18 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నారు. తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై వరుసగా 15వ సారి టైటిల్ అందుకుంది. డొమెస్టిక్ క్రికెట్ వీరుడిగా పేరుపొందిన పద్మాకర్ 2016లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.