Mayawati: మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాయావతి సంచలన నిర్ణయం

- పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- పార్టీకి సంబంధించిన కీలక పదవుల నుంచి నిన్న తొలగింపు
- పార్టీ విధానాలకు హాని కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక
బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
తాను బతికున్నంత కాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని ఆమె ఇటీవల ప్రకటించారు. అంతేకాదు పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి అతనిని తొలగిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. తాజాగా, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే తనకు కుటుంబమని నిన్న ఆమె స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి, బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థను గత నెలలో పార్టీ నుండి బహిష్కరించినట్లు తెలిపారు.