Venkaiah Naidu: స్మగర్లు, దేశద్రోహులను సినిమాల్లో హీరోలుగా చూపిస్తున్నారు: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu criticises film industry for prtraying bad people as heroes

  • హైదరాబాదులో నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ
  • హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • హీరోల పాత్రలపై దర్శకులు తీరు మార్చుకోవాలని హితవు
  • చెడ్డ పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూడదని సూచన

దేశంలో సినీ రంగం పోకడలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల తీరుపై దర్శకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 

ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని... ఇప్పుడు స్మగ్లర్లు, దేశ ద్రోహులు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించేవాళ్లతో హీరో పాత్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎలాంటి సందేశం వెళుతుందో దర్శకులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. 

చెడ్డ పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూడదని, దీని ప్రభావం పిల్లలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగం బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని వెంకయ్యనాయుడు అభిలషించారు. 

ఇటీవల కన్నుమూసిన తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ నేడు హైదరాబాదులో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News