Nara Lokesh: ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్: మంత్రి నారా లోకేశ్

- లీప్ అమలుపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
- గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం
- ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జీఓ 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు శాసనసభ్యులతో వర్క్ షాపు
దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ అధికారులతో నిన్న ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నెల 3వ తేదీన శాసనసభ్యులతో వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీజీ ఫీజు రీఎంబర్స్‌మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. అమరావతిలో ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేష్ కుమార్, కేపీఎంజీ ప్రతినిధులు నారాయణన్ రామస్వామి, సౌమ్య వేలాయుధం, వి.మాధవన్ తదితరులు పాల్గొన్నారు.