SS Rajamouli: ఆ లైవ్ కాన్సర్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా: దర్శకుడు రాజమౌళి ఆసక్తికర ట్వీట్

- 'నా టూర్ ఎమ్ఎమ్‌కే' పేరిట ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సర్ట్
- మార్చి 22న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్
- ఈ లైవ్ కాన్సర్ట్ ను విజయవంతం చేయాలని కోరుతూ జక్కన్న వీడియో సందేశం
ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సర్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. 'నా టూర్ ఎమ్ఎమ్‌కే' పేరిట ఈ కాన్సర్ట్ చేయనున్నారు. మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే, ఈ లైవ్ కాన్సర్ట్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియో సందేశం ఇచ్చారు.
తాను మార్చి 22 కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు జక్కన్న పేర్కొన్నారు. "ఎందుకంటే ఆరోజు అన్నయ్య ఎమ్ఎమ్ కీరవాణి కాన్సర్ట్ ఉంది. ఈ కాన్సర్ట్ లో నా సినిమాలోని పాటలతో పాటు ఆయన సంగీతం అందించిన ఇతర చిత్రాల్లోని పాటలను లైవ్‌లో ఆలపించనున్నారు.
ఇక అన్నయ్య కీరవాణికి నా డిమాండ్ ఏంటి అంటే ఈ లైవ్ కాన్సర్ట్‌లో పాటలతో పాటు ఆయన ఓఎస్‌టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్)లూ ఉండాలి. ఎందుకంటే ఆయన రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలు ఎంత ఫేమసో అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు కూడా అంతే ఫేమస్. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లను, ఓఎస్‌టీలను లైవ్ లో ప్లే చేయాలని కోరుకుంటున్నా" అంటూ తన వీడియో సందేశంలో రాజమౌళి పేర్కొన్నారు.