Kesineni Nani: ఇది కొందరు స్వార్థప్రయోజనాల కోసం చేస్తున్న కుట్ర: కేశినేని నాని

Kesineni Nani opines on Loyola College issue
  • విజయవాడ లయోలా కాలేజీలో అవకతవకలు అంటూ పత్రికా కథనం
  • లయోలా కాలేజీ వంటి విద్యాసంస్థలు ఏ ఒక్క వర్గానికో చెందవన్న కేశినేని నాని
  • ఓ లక్ష్యంతో లయోలా కాలేజీపై దుష్ప్రచారం చేస్తున్నట్టుందని వెల్లడి
విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో అవకతవకలు...? స్వయంప్రతిపత్తి హోదా ముసుగులో అక్రమాలు జరిగాయా? త్రిసభ్య కమిటీ నిర్ధారణ, ఉన్నత విద్యాశాఖకు నివేదిక... అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తపై మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఒక నిర్దేశిత లక్ష్యంతో లయోలా కాలేజీపై దుష్ప్రచారం జరుగుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ వివాదం విద్యాసంస్థల అభివృద్దికి సంబంధించి కాకుండా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్ర అన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని వివరించారు. 

"మనకందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే... లయోలా కాలేజీ వంటి విద్యా సంస్థలు ఏ ఒక్క వర్గానికో చెందవు. కుల, మత, రాజకీయాలు అనే చిన్న పరిమితులను దాటి సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒత్తిళ్లకు లోనవకుండా లయోలా విద్యా సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 

లయోలా కాలేజీ పూర్వ విద్యార్థిగా, 10 ఏళ్ల పాటు విజయవాడ ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా... లయోలా కాలేజీ విజయవాడ ప్రాంత యువత భవిష్యత్తుకు కొన్ని శతాబ్దాల పాటు సేవలు అందించగలదు అని నమ్ముతున్నాను. ఇటువంటి సంస్థను అనవసర వివాదాల్లో ఇరికించవద్దు. 

లయోలా కాలేజీని నడుపుతున్న జెస్యూట్ ఫాదర్స్ అనే సంస్థ నిస్వార్థంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ వ్యాప్తంగా 100 కు పైగా స్కూల్స్, సుమారు 25 కాలేజీలు, 4 విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకు విద్యా దానం చేస్తోంది. అంతర్జాతీయంగానూ పలు దేశాలలో అనేక విద్యా సంస్థలు నడుపుతోంది.

కృష్ణా యూనివర్సిటీ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తాజాగా ఆంధ్ర లయోలా కళాశాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తన నివేదికను సమర్పించిందని వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఆంధ్ర లయోలా కళాశాల సుదీర్ఘకాలంగా త‌న స్వయం ప్రతిపత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూ, విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందిస్తోంది అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 

నిజానికి, లయోలా కళాశాల వద్ద ఉన్న వసతులు, సౌకర్యాలు, అకడమిక్ స్టాండర్డ్స్ కృష్ణా యూనివర్సిటీ కంటే, అలాగే చాలా ప్రైవేట్ యూనివర్సిటీల కంటే చాలా చాలా మెరుగైనవే" అని కేశినేని నాని వివరించారు.
Kesineni Nani
Andhra Loyola College
Vijayawada

More Telugu News